INX Media Case : Karti Chidambaram in CBI custody
సిబిఐ కుంభకర్ణుడి నిద్రపోతోందని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కార్తి చిదంబరం అన్నారు. ఆయనను కోర్టు ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించింది. కార్తి చిదంబరం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దాన్ని కోర్టు తిరస్కరించింది.
కార్తి చిదంబరాన్ని రెండు వారాల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరగా కోర్టు ఆరు రోజుల కస్టడీకి అప్పగించింది. ఈ నెల 6వ తేదీ వరకు పాటియాలా హౌస్ కోర్టు ఆయనను సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అర్థ సత్యాలతో కోర్టును తప్పు దోవ పట్టించడానికి సిబిఐ ప్రయత్నిస్తోందని కార్తి చిదంబరం తరఫున వాదిస్తున్న అభిషేక్ సింఘ్వీ అన్నారు.
కార్తీ అరెస్టయినప్పటికీ.. తండ్రి చిదంబరం మాత్రం ఏమి కాదన్న భరోసాతోనే ఉన్నారు. 'నువ్వేమి బాధపడకు.. నేనున్నాగా..' అంటూ కొడుకుకు భరోసా కూడా ఇచ్చారు.
గురువారం సీబీఐ కోర్టులో కార్తీని కలిసిన సందర్భంగా చిదంబరం ఆయనతో మాట్లాడారు. చిదంబరం కోర్టు వద్దకు చేరుకునేసరికి.. అప్పటికే ఆయన భార్య నళిని చిదంబరం ఆయన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కార్తీని కలిశాక.. అతని భుజంపై చేయి వేసి.. కేసు పట్ల అంతగా ఆందోళన చెందవద్దని చిదంబరం కార్తీకి భరోసా ఇచ్చారు. కాగా, ఈ కేసులో చిదంబరంను కూడా సీబీఐ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కస్టడీలో తనకు ఇంటి భోజనం తెప్పించాలన్న కార్తీ ప్రతిపాదకు న్యాయమూర్తి ఒప్పుకోలేదు. అయితే మెడిసిన్స్,హెల్త్ చెకప్‌కు మాత్రం అనుమతినిచ్చారు. అలాగే కార్తీని కలిసేందుకు ఆయన తరుపు న్యాయవాదికి కూడా అనుమతినిచ్చారు. ప్రతీ రోజు ఉదయం ఒక గంట పాటు, సాయంత్రం ఒక గంట పాటు ఆ వెసులుబాటు కల్పించారు.